Janam Muchata – Voice of the People | Telugu News Platformకల్తీ ఆహారంపై కఠిన చర్యలు తీసుకోవాలి…ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Sep 2026, 6:31 am
Date of Publish : 26 Aug 2026, 4:22 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 282 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

కల్తీ ఆహారంపై కఠిన చర్యలు తీసుకోవాలి…ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై IUML నేత షేక్ బాజీ బాబా ఆరోపణలు…

కల్తీ ఆహారంపై కఠిన చర్యలు తీసుకోవాలి…ఫుడ్ సేఫ్టీ అధికారుల పనితీరుపై IUML నేత షేక్ బాజీ బాబా ఆరోపణలు…

ఖమ్మం: ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాల్సిన బాధ్యత హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలపై ఉందని, అదే సమయంలో ఆహార భద్రతా నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించాల్సిన బాధ్యత ఫుడ్‌ సేఫ్టీ అధికారులపై ఉందని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (IUML) తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ బాబా అన్నారు. ఖమ్మం జిల్లాలో కల్తీ ఆహారం, నాణ్యత లేని ఆహార పదార్థాల వినియోగంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు..ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో షేక్ బాజీ బాబా మాట్లాడుతూ.. ఖమ్మం నగరంలోని కొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. కల్తీ నూనెలు, నాణ్యత లేని మసాలా పదార్థాలు, కల్తీ కారం, పసుపు, అల్లం తదితర పదార్థాలతో పాటు ఆహారానికి రంగు, రుచి పెంచేందుకు వివిధ రకాల పదార్థాలు, ద్రావణాలు ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు.....

కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లకు చనిపోయిన కోళ్లను తక్కువ ధరకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని షేక్ బాజీ బాబా తెలిపారు. వ్యాపార లాభాల కోసం ఇలాంటి నాణ్యత లేని మాంసాన్ని వినియోగిస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
ఈ అంశాలపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు శాస్త్రీయంగా విచారణ నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తమ పార్టీ పరిశీలనలో పలు అంశాలు ఉన్నాయని, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు....

ఖమ్మం నగరంలోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వంట నూనెలు, కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్‌, ఇతర మసాలా పదార్థాలు, ఆహార తయారీలో ఉపయోగించే రంగులు, ఇతర పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించాలని కోరారు.
ఆహార పదార్థాల నాణ్యతతో పాటు వాటిని నిల్వ చేస్తున్న విధానం, పరిశుభ్రత, వంటగది పరిస్థితులు, ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు తదితర అంశాలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత సంస్థలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.....

ప్రస్తుతం ప్రజలు ప్రతిరోజూ బయట ఆహారం తీసుకుంటున్నారని, ముఖ్యంగా చిన్నపిల్లలు, విద్యార్థులు, వృద్ధులు, కుటుంబాలతో బయట భోజనం చేసే వారు ఆహార నాణ్యతపై ఆందోళన చెందుతున్నారని షేక్ బాజీ బాబా అన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఎవరూ చెలగాటం ఆడకూడదని స్పష్టం చేశారు.కల్తీ లేదా అనుమానాస్పద ఆహారం విక్రయిస్తున్నట్లు ప్రజలకు సమాచారం అందితే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసేలా ఫిర్యాదు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. అధికారులు నిర్వహించిన తనిఖీలు, సేకరించిన నమూనాలు, వాటి పరీక్షా ఫలితాలు, తీసుకున్న చర్యల వివరాలను పారదర్శకంగా ప్రజలకు వెల్లడించాలని సూచించారు...

కేవలం పండుగలు లేదా మీడియా దృష్టి ఉన్న సందర్భాల్లో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా నిరంతరంగా తనిఖీలు నిర్వహించాలని షేక్ బాజీ బాబా అన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్‌ వ్యాపారులకు తాము వ్యతిరేకం కాదని, ప్రతి వ్యాపారి నిబంధనలు పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వం, అధికార యంత్రాంగం, వ్యాపారుల సమిష్టి బాధ్యత అని అన్నారు. ఈ విషయంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని కోరారు.....

ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించాలని షేక్ బాజీ బాబా కోరారు. కల్తీ ఆహారం, నాణ్యత లేని ఆహార పదార్థాల వినియోగంపై వచ్చిన ఆరోపణలను పరిశీలించి, అవసరమైన చోట నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.“కల్తీ ఆహారాన్ని అరికట్టాలి.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి” అని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఆహార కల్తీపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని, అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజా ప్రయోజనాల కోసం తదుపరి కార్యాచరణ చేపడతామని ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ ఖమ్మం జిల్లా కమిటీ తరఫున షేక్ బాజీ బాబా ప్రకటించారు.....