Janam Muchata – Voice of the People | Telugu News Platformన్యాయం అడగబోతే.. బూతుల దండకం…ఎస్ఐ దురుసు ప్రవర్తనతో అంగన్‌వాడీ టీచర్… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 12:59 am
Date of Publish : 04 Aug 2026, 11:05 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 355 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

న్యాయం అడగబోతే.. బూతుల దండకం…ఎస్ఐ దురుసు ప్రవర్తనతో అంగన్‌వాడీ టీచర్ తీవ్ర మనస్తాపం!

న్యాయం అడగబోతే.. బూతుల దండకం…ఎస్ఐ దురుసు ప్రవర్తనతో అంగన్‌వాడీ టీచర్ తీవ్ర మనస్తాపం!

మహబూబాబాద్ / దంతాలపల్లి:
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో కఠిన చట్టాలు అమలు చేస్తున్నా.. రక్షక భటులుగా ఉండాల్సిన కొందరు పోలీసు అధికారులు భక్షకులుగా మారుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసి న్యాయం పొందుదామని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన అంగన్‌వాడీ మహిళా ఉద్యోగులకు చేదు అనుభవం ఎదురైంది. వేధింపులకు గురిచేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్ఐ.. ఫిర్యాదుదారులపైనే బూతు పురాణం ఎత్తుకోవడంతో ఓ అంగన్‌వాడీ టీచర్ తీవ్ర మనస్తాపానికి గురై స్పృహ కోల్పోయిన దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది...

జిల్లాలోని దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామానికి చెందిన ఆవుల మంజుల అంగన్‌వాడీ టీచర్‌గా, వెంకటలక్ష్మి హెల్పర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, విధుల్లో ఉన్న సమయంలో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వీరిని తీవ్రంగా వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులు భరించలేక అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంజుల, వెంకటలక్ష్మి ఇద్దరూ కలిసి దంతాలపల్లి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు....పోలీస్ స్టేషన్‌లో వారికి దంతాలపల్లి ఎస్ఐ రవికుమార్ రూపంలో ఊహించని అవమానం ఎదురైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని మహిళలు అని కూడా చూడకుండా ఎస్ఐ రవికుమార్ అత్యంత దురుసుగా ప్రవర్తించారు. వారిని తన ఛాంబర్‌లోకి పిలిపించుకుని నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ తీవ్రంగా అవమానించారు. బాధితులనే కాకుండా వారి భర్తలను సైతం అసభ్య పదజాలంతో దూషించారని, "తొక్కి చంపుతాం" అంటూ ఎస్ఐ తమను తీవ్ర స్థాయిలో బెదిరించారని మహిళలు ఆరోపిస్తున్నారు....

న్యాయం కోసం వెళితే స్టేషన్‌లో ఎస్ఐ అందరి ముందు అసభ్యంగా దూషించడం, భయభ్రాంతులకు గురిచేయడంతో అంగన్‌వాడీ టీచర్ ఆవుల మంజుల తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక పోలీస్ స్టేషన్‌లోనే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు...

పోలీస్ స్టేషన్‌లో తమకు జరిగిన ఘోర అవమానంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎస్ఐ రవికుమార్ ప్రవర్తనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.అలాగే, తొర్రూరు సీఐ గణేష్‌ను కలిసి ఈ ఘటనపై పూర్తి వివరాలతో కూడిన పిటిషన్‌ను అందజేశారు.బాధితుల పట్ల, మహిళల పట్ల కనీస గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐను తక్షణమే విధుల్లో నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.తమను మానసికంగా వేధించి, అవమానించిన ఎస్ఐ రవికుమార్‌పై పై అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే.. తమకు ఆత్మహత్యే శరణ్యమని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాటి మహిళల పట్ల ఓ పోలీస్ అధికారి ఈ తరహాలో ప్రవర్తించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.....