Janam Muchata – Voice of the People | Telugu News Platformఖమ్మం కార్పొరేషన్‌లో కోట్లు కొల్లగొడుతున్న ‘డీజిల్’ దందా..అధికార పార్టీ నాయకులు,అధికారుల… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 11 Aug 2026, 11:55 pm
Date of Publish : 04 Aug 2026, 10:21 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 306 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం కార్పొరేషన్‌లో కోట్లు కొల్లగొడుతున్న ‘డీజిల్’ దందా..అధికార పార్టీ నాయకులు,అధికారుల కుమ్మక్కుతో భారీ కుంభకోణం…

ఖమ్మం కార్పొరేషన్‌లో కోట్లు కొల్లగొడుతున్న ‘డీజిల్’ దందా..అధికార పార్టీ నాయకులు,అధికారుల కుమ్మక్కుతో భారీ కుంభకోణం…

ఖమ్మం : ఖమ్మం నగరపాలక సంస్థ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. నగర పారిశుద్ధ్యం, ప్రజా అవసరాల కోసం వెచ్చించాల్సిన కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతోంది. మున్సిపల్ అధికారులతో అధికార పార్టీ నాయకులు చేతులు కలపడంతో కార్పొరేషన్‌లో భారీ "డీజిల్ కుంభకోణం" వెలుగుచూసింది. పంచాయతీరాజ్ శాఖ నుంచి డిప్యుటేషన్‌పై వచ్చి, కార్పొరేషన్‌లో చక్రం తిప్పుతున్న ఒక ఉద్యోగి కనుసన్నల్లోనే ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి....

గత ప్రభుత్వ హయాంలో స్థానిక దానవాయిగూడెంలో తెలంగాణ ప్రభుత్వ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో మున్సిపల్ కార్పొరేషన్ వాహనాలకు డీజిల్ కొట్టించేవారు. దీనివల్ల ప్రభుత్వ శాఖల మధ్య లావాదేవీలు పారదర్శకంగా ఉండేవి.అయితే, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఈ విధానానికి తూట్లు పడ్డాయి.నిత్యం ఓ జిల్లా మంత్రి వెన్నంటి ఉండే ఒక అధికార పార్టీ నాయకుడు, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కీలక విధులు నిర్వర్తించే ఓ అధికారి, ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో కీలకమైన పదవుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే ఖమ్మం బైపాస్ రోడ్డులోని ఒక ప్రైవేట్ పెట్రోల్ బంకుకు ఎటువంటి అధికారిక ప్రభుత్వ అనుమతులు లేకుండానే కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా డీజిల్ కొనుగోళ్లను మార్చేశారు. అప్పటి నుంచి
ఈ బంకు కేంద్రంగానే కోట్ల రూపాయల డీజిల్ పక్కదారి పడుతోందని ప్రధాన ఆరోపణలు వినిపిస్తున్నాయి...

కార్పొరేషన్ పరిధిలో చెత్త తరలించే గ్రీన్ ఆటోలు, మినీ లారీలు, జేసీబీలు, ట్రాక్టర్ల ఇంధనం కోసం అధికారులు ప్రత్యేక కూపన్లు జారీ చేస్తారు. డిప్యుటేషన్ అధికారి సూచనల మేరకు అసిస్టెంట్ కమిషనర్, డీజిల్ కూపన్లు జారీ చేసే ఉద్యోగి ఆధ్వర్యంలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.ఉదాహరణకు ఒక జేసీబీకి లేదా ట్రాక్టర్‌కు 50 లీటర్ల డీజిల్ కూపన్ ఇస్తే, బంకులో కేవలం 15-20 లీటర్లు మాత్రమే వాహనం ట్యాంకులో నింపుతారు.మిగతా 30 లీటర్లను ప్రత్యేక ప్లాస్టిక్ క్యాన్లలో నింపి, బంకు వెనుక వైపు నుంచి బయటి వ్యక్తులకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని,బిల్లు మాత్రం 50 లీటర్లకు కార్పొరేషన్ ఖాతా నుంచి డ్రా అవుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి....

వాహనాల కదలికలను పర్యవేక్షించేందుకు అమర్చిన జీపీఎస్ (GPS) సిస్టమ్‌ను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని,వాహనాలు ఎన్ని కిలోమీటర్లు తిరిగాయి? ఎన్ని గంటలు పనిచేశాయి? అనే వివరాలు నమోదు చేసే లాగ్‌బుక్స్‌లో పూర్తిగా తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని,డిపోల్లో కదలకుండా ఉన్న వాహనాలకు కూడా తిరిగినట్లు లెక్కలు రాసి డీజిల్ కోటాను స్వాహా చేస్తున్నారని దీని ప్రభావం నగర పారిశుద్ధ్యంపై తీవ్రంగా పడుతోందని కార్పొరేషన్ ఉద్యోగ వర్గాల్లోనే గుసగుసలు వినిపించడం గమనార్హం...ఇంధనం లేక చెత్త వాహనాలు కొద్దిసేపటికే డిపోలకు చేరుకుంటుండటంతో నగరంలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోతోందని వీధులు అపరిశుభ్రంగా మారి మురుగునీటి సమస్యలతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...

ఈ డీజిల్ అక్రమాలు తారస్థాయికి చేరి, విషయం బయటకు పొక్కడంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించి బాధ్యులైన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కానీ, అధికార పార్టీ నాయకుల నుంచి వచ్చిన తీవ్రస్థాయి ఒత్తిళ్ల కారణంగా.. సస్పెండ్ చేసిన గంటల వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుని, సదరు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడం గమనార్హం. ఈ పరిణామం అధికారుల పనితీరుపై, పాలనలో రాజకీయ జోక్యంపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది....

నగర పారిశుద్ధ్యాన్ని గాలికొదిలేసి, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న ఈ డీజిల్ మాఫియాపై తక్షణం చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని, విజిలెన్స్ లేదా స్వతంత్ర సిట్టింగ్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని,గత కొన్నేళ్లుగా జారీ చేసిన డీజిల్ కూపన్లు, పెట్రోల్ బంక్ రికార్డులు, లాగ్‌బుక్స్‌, జీపీఎస్ డేటాను క్షుణ్ణంగా ఆడిట్ చేయాలని,అక్రమాలు నిజమని తేలితే.. కార్పొరేషన్ ఖజానాకు నష్టం కలిగించిన ప్రతి రూపాయిని బాధ్యులైన అధికారులు, బంకు యాజమాన్యంపై రెవెన్యూ రికవరీ (RR) చట్టం కింద వసూలు చేయాలని,కేవలం నామమాత్రపు చర్యలతో సరిపెట్టకుండా బాధ్యులందరిపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేసి, కార్పొరేషన్‌లో పారదర్శకతను కాపాడాలని స్థానికులు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు.....