Janam Muchata – Voice of the People | Telugu News Platform › ఖమ్మం అర్బన్ మండల కార్యాలయంలలో    ఆధిపత్య పోరు…పట్టించుకోని ఉన్నతాదికారులు… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 11 Oct 2026, 10:05 pm
Date of Publish : 01 Aug 2026, 12:18 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 301 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం అర్బన్ మండల కార్యాలయంలలో    ఆధిపత్య పోరు…పట్టించుకోని ఉన్నతాదికారులు…

ఖమ్మం అర్బన్ మండల కార్యాలయంలలో    ఆధిపత్య పోరు…పట్టించుకోని ఉన్నతాదికారులు…

ఖమ్మం అర్బన్ : ప్రజలకు సేవలందించాల్సిన రెవెన్యూ కార్యాలయాలు అవినీతికి, ఆధిపత్య పోరుకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. సామాన్యుడి అవసరమే ఆసరాగా కొందరు రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా ఖమ్మం అర్బన్ మండల కార్యాలయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఉద్యోగుల మధ్య రాజుకున్న ఆధిపత్య పోరు, సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న బహిరంగ వసూళ్ల పర్వం తీవ్ర విమర్శలకు తావిస్తోంది....

కార్యాలయంలో విధులు పారదర్శకంగా జరగాలంటే సెక్షన్ల విభజన సమగ్రంగా ఉండాలి. కానీ, ఖమ్మం అర్బన్ మండల కార్యాలయంలో ప్రధాన ఆదాయ వనరుగా భావించే సెక్షన్లన్నీ తహసీల్దార్ ఒకే జూనియర్ అసిస్టెంటుకు కట్టబెట్టడం తీవ్ర దుమారం రేపుతోంది.ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్స్,ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్స్
క్రిమిలేయర్, నాన్-క్రిమిలేయర్,కుల ధృవీకరణ పత్రాలు,ల్యాండ్ రికార్డ్ జెన్యూనిటీ ఇలా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ సెక్షన్లన్నింటినీ ఒకే వ్యక్తికి అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని మిగతా సిబ్బంది కినుక వహించినట్లు సమాచారం...

కీలక సెక్షన్లు దక్కించుకున్న సదరు జూనియర్ అసిస్టెంట్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజువారీ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే బాధితులతో కనీస మర్యాద లేకుండా, ఏదో ఒక రకంగా గొడవలకు దిగుతున్నాడని స్థానికులు మండిపడుతున్నారు. కనీస కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వ్యక్తికి ఇన్ని బాధ్యతలు ఎలా ఇస్తారని తోటి సిబ్బంది సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే, తనను ప్రశ్నించిన వారిపై సదరు జూనియర్ అసిస్టెంట్ వెంటనే "కులం కార్డు" ప్రయోగిస్తూ, బ్లాక్ మెయిల్ ధోరణికి పాల్పడుతున్నట్లు కార్యాలయంలో బహిరంగ రహస్యంగా మారింది....

మండల కార్యాలయాల్లో సర్టిఫికెట్ల జారీకి ఒక అలిఖిత "రేటు కార్డు" నడుస్తోందనేది జగమెరిగిన సత్యం. ఖమ్మం అర్బన్ ఆఫీసులో ఇది మరింత శృతిమించింది.సదరు జూనియర్ అసిస్టెంట్ చుట్టూ ఒక అనుచరగణం చేరి, ఏ సర్టిఫికెట్‌కు ఎంత ఇవ్వాలో బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.విద్యార్థులకు అత్యవసరమైన కుల, ఆదాయ, EWS సర్టిఫికెట్ల నుంచి మొదలుకుని.. ఆస్తి పంపకాలకు అవసరమైన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల వరకు చేతులు తడపనిదే అంగుళం కూడా ఫైలు ముందుకు కదలడం లేదు.భూభారతి ఫైల్స్ క్లియరెన్స్ వంటి అత్యంత కీలకమైన రెవెన్యూ వ్యవహారాల్లో లక్షల్లో చేతులు మారుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దళారులను ఆశ్రయిస్తే గంటల్లో పని అవుతుందని, నేరుగా వెళ్తే రోజుల తరబడి చెప్పులరిగేలా తిప్పుకుంటున్నారని సామాన్యులు వాపోతున్నారు....

సాధారణంగా రెవెన్యూ మాన్యువల్ ప్రకారం.. ఏదైనా ధృవీకరణ పత్రం జారీ చేయాలంటే క్షేత్రస్థాయిలో వీఆర్వో/జీపీవో (GPO), మరియు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలి. కానీ, ఇక్కడ సదరు జూనియర్ అసిస్టెంట్ ద్వారా వచ్చే ఫైళ్లకు జీపీవో, ఆర్‌ఐ ల రిపోర్ట్‌తో పనే లేకుండా నేరుగా తహసీల్దారుతో అప్రూవల్ చేపిస్తుండటం పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తోంది.కిందిస్థాయి అధికారుల నివేదిక లేకుండానే తహసీల్దార్ ఎలా సంతకాలు చేస్తున్నారో అంతుపట్టని విషయంగా మారింది.ఇది కేవలం ఒక ఉద్యోగి అవినీతి కాదని, పైస్థాయి అధికారుల అండదండలతో సాగుతున్న వ్యవస్థీకృత దోపిడీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి....

కుల, మతాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాల్సిన రెవెన్యూ కార్యాలయంలో "కులాల కుంపట్లు" రాజేస్తూ, పబ్బం గడుపుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, ఆర్డీవో (RDO) స్పందించి ఖమ్మం అర్బన్ మండల కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై, సెక్షన్ల కేటాయింపులో ఉన్న పక్షపాతంపై లోతైన విచారణ జరపాలని, సర్టిఫికెట్ల జారీ పేరుతో సామాన్యులను దోచుకుంటున్న దళారీ వ్యవస్థను ఉక్కుపాదంతో అణచివేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు....