Janam Muchata – Voice of the People | Telugu News Platform › ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో టాయిలెట్స్ దందా…టాయిలెట్లు క్లోజ్.. కలెక్షన్స్ ఫుల్… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 12 Oct 2026, 11:19 pm
Date of Publish : 01 Aug 2026, 8:47 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 310 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో టాయిలెట్స్ దందా…టాయిలెట్లు క్లోజ్.. కలెక్షన్స్ ఫుల్…

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో టాయిలెట్స్ దందా…టాయిలెట్లు క్లోజ్.. కలెక్షన్స్ ఫుల్…

ఖమ్మం సిటీ,జూలై 31: ఖమ్మం నగరంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా ధనంతో నిర్మించిన మరుగుదొడ్లు కొందరు ప్రైవేటు వ్యక్తులకు, అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం జరగాల్సిన టెండర్ ప్రక్రియను పూర్తిగా పక్కనపెట్టి, కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.గత ప్రభుత్వ హయాంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ నిరంతరంగా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కొనసాగేందుకు వినూత్నంగా వాటికి అనుబంధంగా వాణిజ్య దుకాణాలు  నిర్మించారు. ఆ దుకాణాల ద్వారా వచ్చే అద్దె ఆదాయంతో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ,నీటి వసతి, విద్యుత్, పారిశుధ్య కార్మికుల జీతాలు ఆ డబ్బుతో నిర్వహించాలన్నది నాటి ప్రభుత్వ ఉద్దేశం.కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది.ప్రస్తుతం నగరంలోని అనేక పబ్లిక్ టాయిలెట్లు తాళాలు వేసి, పిచ్చిమొక్కలు మొలిచి ప్రజలకు అందుబాటులో లేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు, టాయిలెట్లకు అనుబంధంగా ఉన్న వాణిజ్య దుకాణాలు మాత్రం పూర్తిస్థాయిలో నడుస్తుండటం, వాటి ద్వారా ప్రైవేటు వ్యక్తులు జేబులు నింపుకుంటుండటం గమనార్హం....

మున్సిపల్ చట్టాల ప్రకారం.. కార్పొరేషన్ పరిధిలోని ఏ వాణిజ్య సముదాయాన్ని అయినా, నిర్వహణ బాధ్యతలను అయినా అప్పగించాలంటే 'బహిరంగ టెండర్' లేదా 'ఈ-ప్రొక్యూర్‌మెంట్' ద్వారా పారదర్శకంగా నిర్వహించాలి.స్థానిక దినపత్రికలలో ప్రకటన ఇవ్వాలి. అత్యధిక బిడ్ దాఖలు చేసిన వారికి లేదా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం తెచ్చే వారికి ఆ బాధ్యతలు అప్పగించాలి.కానీ, ఖమ్మం పబ్లిక్ టాయిలెట్ల వ్యవహారంలో ఈ టెండర్ ప్రక్రియను పూర్తిగా తుంగలో తొక్కారనేది ప్రధాన ఆరోపణ.ఎలాంటి పత్రికా ప్రకటనలు లేకుండా, ఈ-టెండర్ విధానాన్ని పక్కనపెట్టి, కేవలం కాగితాలకే పరిమితం చేసి కొందరు బినామీలకు ఈ దుకాణాలను కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరు అధికార పార్టీకి చెందిన యూత్ లీడర్లు,మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఓ కీలక ఉద్యోగి కలిసి చక్రం తిప్పడమే కాకుండా ఈ టెండర్ల ప్రక్రియను అత్యంత రహస్యంగా ముగించారని, ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి....

స్థానికుల ఆరోపణల ప్రకారం, ఈ అక్రమ టెండర్ల ద్వారా దుకాణాలను చేజిక్కించుకున్న వ్యక్తి.. వ్యాపారుల నుంచి ప్రతి దుకాణానికి నెలకు సుమారు రూ.30 వేల వరకు అద్దె వసూలు చేస్తున్నాడు. కానీ, మున్సిపల్ కార్పొరేషన్‌కు మాత్రం నెలకు కనీస నామమాత్రపు రుసుము కూడా చెల్లించడం లేదని తెలుస్తోంది. ఆదాయం రాకపోగా, టాయిలెట్ల నిర్వహణ కూడా గాలికొదిలేశారు. దీంతో అటు కార్పొరేషన్‌కు ఆదాయం గండి, ఇటు ప్రజలకు సౌకర్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది.ఈ మొత్తం వ్యవహారంలో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని వెంటనే సీరియస్ ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు....

ప్రధానంగా పబ్లిక్ టాయిలెట్లకు అనుబంధంగా ఉన్న దుకాణాల కేటాయింపు ఎలా జరిగింది? ఆఫ్‌లైన్ టెండర్లు వేశారా? ఆన్‌లైన్ టెండర్లు వేశారా?టెండర్ ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లను వెంటనే సీజ్ చేసి, అందులో జరిగిన అవకతవకలను గుర్తించాలని,మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇప్పటి వరకు ఎంత అద్దె ఆదాయం రావాలి? ఎంత జమ అయింది?...అద్దె వసూలు చేస్తున్న వారు ఆ నిధులను పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు ఎందుకు వినియోగించడం లేదు? అనే విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని,విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలితే, ఖమ్మం ప్రజల పన్నుల రూపంలో మున్సిపల్ కార్పొరేషన్‌కు రావాల్సిన ప్రతి రూపాయిని సంబంధిత బాధ్యుల నుంచి వడ్డీతో సహా రికవరీ చేసి మున్సిపల్ ఖజానాలో జమ చేయాలని,ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించిన అధికారులపై, తెరవెనుక ఉండి నడిపించిన నాయకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఖమ్మం ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పారదర్శక విచారణ జరిపితేనే ఈ 'టాయిలెట్' స్కాంలో ఉన్న అసలు తిమింగలాలు బయటకు వచ్చే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు....