తెలంగాణా /హైదరాబాద్ :
న్యూఢిల్లీ: హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాలకు (ఉదాహరణకు క్రైస్తవ మతం) మారితే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను పూర్తిగా కోల్పోతారని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది. అంతేకాకుండా, ఈ తీర్పును సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది...
సుప్రీం కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు...
క్రైస్తవ మతంలోకి మారిన లేదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాల పరిధిలోకి రాని ఇతర మతాలను స్వీకరించిన వ్యక్తులకు ఎస్సీ హోదా తక్షణమే, పూర్తిగా రద్దవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.మతం మారిన వారు ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద రక్షణను లేదా ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలను పొందేందుకు అర్హులు కారని ధర్మాసనం తేల్చిచెప్పింది.రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ కులాల (Scheduled Castes) ఆర్డర్-1950 ప్రకారం.. కేవలం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలను ఆచరించే వారికే ఎస్సీ హోదా వర్తిస్తుంది. ఈ నిబంధన చాలా స్పష్టంగా, కఠినంగా ఉందని మరియు మినహాయింపులకు తావులేదని కోర్టు పేర్కొంది....
కేసు నేపథ్యం....
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాకు చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ ఒక వివాదానికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. అయితే ఆయన క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నందున ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని, అందువల్ల అట్రాసిటీ కేసు చెల్లదని ప్రతివాదులు కోర్టును ఆశ్రయించారు. ఈ వాదనతో ఏకీభవించిన ఏపీ హైకోర్టు ఆయన ఎస్సీ హోదా కోల్పోయినట్లు తీర్పునిచ్చింది.ఈ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పులో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని తేల్చిచెబుతూ రివ్యూ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. మతం మారిన తర్వాత పాత కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ అవి చెల్లవని, మత మార్పిడి జరిగిన వెంటనే చట్టపరంగా ఎస్సీ హోదా రద్దవుతుందని న్యాయస్థానం మరోసారి గట్టిగా పునరుద్ఘాటించింది.....
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456