తెలంగాణ /ఖమ్మం జిల్లా :
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరొందిన, రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని రాబోయే గోదావరి పుష్కరాల నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భద్రాద్రి రామయ్య ప్రాచీన వైభవానికి ప్రతీకగా నిలిచేలా చేపట్టిన పునరుద్ధరణ పనులు పుష్కరాలు ప్రారంభం కావడానికి 15 రోజుల ముందే వంద శాతం పూర్తి కావాలని ఆయన స్పష్టం చేశారు.ఆదివారం భద్రాచలంలో పర్యటించిన మంత్రి.. ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు....
రూ.351 కోట్లతో అభివృద్ధి....భూసేకరణకు రూ.75 కోట్లు....
సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భద్రాద్రి పునరుద్ధరణ పనులకు నాంది పలికామని గుర్తుచేశారు. ఈ బృహత్తర కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఇందులో ఆలయ విస్తరణ, అభివృద్ధికి అత్యంత కీలకమైన భూసేకరణ ప్రక్రియ కోసం ఇప్పటికే రూ.75 కోట్లు వెచ్చించినట్లు మంత్రి వెల్లడించారు.....
ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం.. పనుల్లో వేగం పెంచాలి.....
భద్రాద్రి క్షేత్రం యొక్క చారిత్రక, ఆధ్యాత్మిక విశిష్టత ఏమాత్రం చెక్కుచెదరకుండా పనులు జరగాలని మంత్రి అధికారులకు సూచించారు.పురాతన గోపురాలు, కట్టడాల సహజత్వానికి ఎలాంటి భంగం కలగకుండా నిపుణులైన శిల్పులతో, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పనులు చేపట్టాలి. ఆగమశాస్త్ర నిబంధనలను కచ్చితంగా పాటించాలని పనుల్లో వేగం పెంచేందుకు వీలుగా, అవసరమైన చోట ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 25 శాతం మంది కార్మికులను నియమించాలని బాధ్యతాయుతమైన అధికారులు, నిపుణులు నిరంతరం క్షేత్రస్థాయిలోనే ఉండి పనులను పర్యవేక్షించేలా చూడాలని,డ్రాయింగ్‌లు, సాంకేతిక అనుమతుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని అలాగే ఒకవైపు పనులు పూర్తయిన తర్వాతే మరోవైపు పనులు ప్రారంభించాలని ముఖ్యంగా ఎక్కువ పని ఉన్న ఉత్తర భాగంలో పనులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.....
పది రోజులకోసారి కమిషనర్ సమీక్ష.. ప్రత్యేక అధికారి నియామకం....
ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కోసం ఇంజినీరింగ్ శాఖ నుంచి తక్షణమే ఒక 'ప్రత్యేక అధికారి'ని నియమించాలని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావును మంత్రి పొంగులేటి టెలిఫోన్ ద్వారా ఆదేశించారు. అలాగే, కమిషనర్ ప్రతి పది రోజులకోసారి స్వయంగా భద్రాచలం వచ్చి క్షేత్రస్థాయిలో పనుల ప్రగతిని పరిశీలించాలని సూచించారు.పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత పరంగా ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల విజ్ఞప్తుల మేరకు గోదావరి పరివాహక ప్రాంతంలో నూతన స్నాన ఘట్టాల నిర్మాణం, యాత్రికుల వసతుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.....
మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికిన అధికారులు, వేదపండితులు....
అంతకుముందు సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్న మంత్రి పొంగులేటికి జిల్లా కలెక్టర్ అంకిత్ మొక్క అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ఆలయానికి చేరుకున్న మంత్రికి ఈవో దామోదరరావు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రికి పండితులు వేదాశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, గ్రామ సర్పంచ్ పూనెం దొర, ఆర్కిటెక్ట్ మూర్తి తదితర ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.....
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456