తెలంగాణ /ఖమ్మం జిల్లా :
కూసుమంచి:రానున్న రోజుల్లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతాంగం అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ మెట్ట పంటల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సూచించారు. శనివారం పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు, లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల చెక్కులను పంపిణీ చేశారు....
ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా సాగు పద్ధతుల్లో మార్పు రావాలి....
ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో.. రైతులు సాంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలకాలని మంత్రి కోరారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ వ్యవసాయ పద్ధతులను మార్చుకోవాలన్నారు.అదే విధంగా అధిక నీటి వినియోగం ఉండే పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటి అవసరాలతో చేతికొచ్చే మెట్ట పంటలను సాగు చేయాలని సూచించారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి అని, ఇప్పటికే రైతులకు 'రైతు భరోసా' అందించి వారికి ఆర్థికంగా అండగా నిలిచామని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు....
రూ.4.61 కోట్లతో ప్రగతి పనులకు శ్రీకారం....
మండల పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి పలు గ్రామాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.రూ. 2.52 కోట్లతో పెరికసింగారం ఎన్‌ఎస్‌పీ కెనాల్ నుంచి భగవాన్ తండా మీదుగా మల్లాయిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, అలాగే రూ. 20 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ కార్యాలయ నూతన భవనానికి శంకుస్థాపన చేశారు.అంతే కాకుండా రూ. 1.69 కోట్లతో లింగారం తండా నుంచి లోక్యా తండా ఎన్‌ఎస్‌పీ కాలువ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.అదే విధంగా అగ్రహారం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి మంత్రి భూమిపూజ చేశారు.....
ఆపన్నులకు సీఎంఆర్ఎఫ్.. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి....
అభివృద్ధి పనుల అనంతరం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి తన చేతుల మీదుగా సంక్షేమ పథకాల చెక్కులను పంపిణీ చేశారు.మండల వ్యాప్తంగా మంజూరైన 66 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 111 మంది బాధితులకు మొత్తం రూ. 35.16 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు పాల్గొన్నారు.....
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456