తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం, జూలై 17: "నేడు చెట్టు నాటుదాం.. రేపటి కోసం పచ్చని భవిష్యత్తును నిర్మిద్దాం" అనే నినాదంతో ఖమ్మం నగరంలోని స్మార్ట్ కిడ్జ్ పాఠశాల విద్యార్థులు చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పాఠశాల ప్రాంగణంలో మరియు నగరంలోని ప్రధాన రహదారుల వెంబడి చిన్నారులు నిర్వహించిన 'వనమహోత్సవ' వేడుకలు ఎంతో స్ఫూర్తిదాయకంగా సాగాయి.....
చైతన్యవంతంగా వనమహోత్సవ ర్యాలీ.....
శుక్రవారం ఉదయం పాఠశాల నుంచి ప్రారంభమైన విద్యార్థుల చైతన్య ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. మొక్కల ప్రాముఖ్యతను తెలుపుతూ, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన లఘు నాటిక, మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను కళ్లకు కట్టినట్లు వివరించి అందరినీ ఆలోచింపజేసింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ హార్టికల్చర్ అధికారి రాధిక మాట్లాడుతూ, "పర్యావరణ సమతుల్యతకు మొక్కలే కీలకం. చిన్నారులు ఈ వయసులోనే మొక్కల పట్ల ఇంతటి బాధ్యతను ప్రదర్శించడం అభినందనీయం. పాఠశాల విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమం ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలిచింది" అని కొనియాడారు. మొక్కలు నాటడం ఒక్కటే కాదు, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆమె గుర్తు చేశారు.....
సామాజిక బాధ్యతగా మొక్కల పెంపకం: పాఠశాల కరస్పాండెంట్....
పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, "ప్రతి సంవత్సరం సామాజిక బాధ్యతగా వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. గతంలో మా విద్యార్థులు నాటిన మొక్కలు నేడు పెద్దవై నీడనివ్వడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. విద్యార్థులందరూ తమ పుట్టినరోజున తప్పనిసరిగా ఒక మొక్క నాటాలని" పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశారు. ఈ సంబరాల్లో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిట్టి చేతులు నాటిన ఈ మొక్కలు, రేపు ఖమ్మం నగరానికి పచ్చని తోరణాలుగా మారాలని ఆకాంక్షిద్దాం.....
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456