తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం సిటీ : ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనుల పేరిట ప్రజాధనం పక్కదారి పడుతోంది. నగర సుందరీకరణ, మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తుంటే.. ఆ నిధులు కాంట్రాక్టర్లు, కొందరు అవినీతి అధికారుల జేబులు నింపుతున్నాయి. అధికార పార్టీ నాయకుల అండదండలు, మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నామమాత్రపు పనులతో మమ అనిపిస్తూ నాసిరకం నిర్మాణాలతో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు.అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, కనీస ప్రమాణాలు పాటించడం లేదని ప్రశ్నిస్తున్న స్థానిక పౌరులపై కాంట్రాక్టర్లు దౌర్జన్యానికి దిగుతున్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి.. "మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.. మీ దిక్కున్న దగ్గర చెప్పుకోండి" అంటూ ఇష్టానుసారంగా ప్రేలాపనలు పేలుతున్నారు. ఇంజనీరింగ్ అధికారుల పూర్తి మద్దతు ఉండటంతోనే కాంట్రాక్టర్లు ఇంతలా బరితెగిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏసీ గదులకే పరిమితం కావడం ఈ అక్రమాలకు ఊతం ఇస్తోంది...
తాజాగా నగరంలోని 20వ డివిజన్, రామచంద్రయ్య నగర్ లో జరుగుతున్న సైడ్ డ్రైన్ (మురుగు కాలువ) నిర్మాణంలో నిబంధనలను పూర్తిగా గాలికి వదిలేశారు. రోడ్ నెంబర్ 10 పరిధిలో చేపట్టిన ఈ నిర్మాణంలో ఏ ఒక్క నాణ్యతా ప్రమాణాన్ని కాంట్రాక్టర్ పాటించడం లేదు.వాస్తవానికి సిమెంట్, ఇసుక, కంకరతో నిర్మించాల్సిన డ్రైన్లకు.. కాంట్రాక్టర్లు లాభార్జనే ధ్యేయంగా ఇసుక బదులు అత్యంత చౌకగా దొరికే 'గ్రానైట్ డస్ట్'ను వాడుతున్నారు. దీనివల్ల నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే పగుళ్లు వచ్చి డ్రైన్లు కుంగిపోయే ప్రమాదం ఉంది.అంతే కాకుండా సిమెంట్ నిర్మాణాలకు నీటితో క్యూరింగ్ చేయడం అత్యంత కీలకం. కానీ ఇక్కడ డ్రైన్ నిర్మాణం చేపట్టి వారం రోజులు గడుస్తున్నా.. ఇంతవరకు ఒక్క చుక్క నీటితో కూడా క్యూరింగ్ చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు....
ఖమ్మం నగర వ్యాప్తంగా జరుగుతున్న సైడ్ డ్రైన్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.ముందుగా తక్కువ అంచనాలతో పనులు దక్కించుకుని, ఆ తర్వాత మట్టి తవ్వకం, రాక్ కటింగ్ పేర్లతో అంచనా వ్యయాన్ని ఇష్టారీతిన పెంచేస్తున్నారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి అదే విధంగా పాత ఇనుమును వాడటం, సిమెంట్ మోతాదు తగ్గించి డస్ట్ వాడటం ద్వారా కాంట్రాక్టర్లు బిల్లులు దండుకుంటున్నారని డ్రైన్లకు సరైన స్లోప్ ఇవ్వకపోవడం వల్ల మురుగు నీరు ముందుకు పారకుండా ఎక్కడికక్కడే నిలిచిపోయి దోమలకు ఆవాసంగా మారుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా బిల్లులు పాస్ చేసే ముందు అసిస్టెంట్ ఇంజనీర్లు (AE), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు (DEE) పనుల నాణ్యతను తనిఖీ చేయాలి. కానీ అధికారులకు ముందుగానే 'కమీషన్లు' ముట్టజెప్పడంతో వారు సైట్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వస్తున్నాయి.....
రామచంద్రయ్య నగర్ లో జరుగుతున్న ఈ లోపభూయిష్టమైన డ్రైన్ నిర్మాణంపై మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో విజిలెన్స్ లేదా క్వాలిటీ కంట్రోల్ అధికారులతో తనిఖీలు చేయించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, బిల్లులు నిలిపివేసి కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించకుంటే ప్రజా ఆందోళనలు ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు......
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456