Janam Muchata – Voice of the People | Telugu News Platformరాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం: కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 2:39 am
Date of Publish : 10 Jul 2026, 9:15 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 596 💬 0
Telangana > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Latest News > Mahabubabad > Politics

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం: కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం – సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు….

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం: కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుతాం – సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు….

ఖమ్మం (జూలై 10, 2026): తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో లక్షలాది మంది ఖమ్మం బిడ్డల సాక్షిగా ఆయన ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుంబంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన గత అంచనాలు ఏ విధంగా నిజమయ్యాయో వివరిస్తూ, భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రంపై సంచలన జోస్యం చెప్పారు.2023 జూలైలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్బంగా ఖమ్మంలో జరిగిన రాహుల్ గాంధీ బహిరంగ సభ జరిగిన తర్వాత.. గాంధీ భవన్‌లో మీడియా మిత్రులతో జరిగిన చిట్ చాట్ ను సీఎం రేవంత్ గుర్తుచేశారు. ఆనాడు బీఆర్ఎస్ మాయమాటలు, మూటలు, మరియు వేగంగా దూసుకొస్తున్న బీజేపీని తట్టుకుని కాంగ్రెస్ ఎలా గెలుస్తుందని విలేకరులు ప్రశ్నించగా.. తాను ఒక కాగితం మీద రాసి సీల్డ్ కవర్లో పెట్టమని చెప్పినట్లు గుర్తుచేశారు.....

తన అంచనా ప్రకారం కాంగ్రెస్ 65, సీపీఐ 1, బీజేపీ 8-9, ఎంఐఎం 6-7 స్థానాలు గెలుస్తాయని తాను చెబితే, అదే నిజమైందని అన్నారు. 64 సీట్లతో కాంగ్రెస్, 1 సీటుతో సీపీఐ గెలవగా, ఆ తర్వాత కంటోన్మెంట్ లో గణేష్, జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్ బలం 66కు చేరిందన్నారు. అలాగే చేవెల్ల గడ్డ మీద నుంచి సవాల్ విసిరినట్లుగానే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్నా ఇప్పించామని, రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో 230 మెజారిటీ, మున్సిపల్ ఎన్నికల్లో 85 నుంచి 90 శాతం స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఉద్దేశించి 'పాపాల భైరవుడిని ఫామ్ హౌస్ లోనే బంధించాం.. ఇక ఈ పశుపతికి విముక్తి లేదు' అని ఘాటుగా విమర్శించారు....

ఈ సందర్బంగా బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై నిప్పులు చేరిగారు అంతే కాకుండా కల్వకుంట్ల కుటుంబాన్ని 'కౌరవ వంశం'గా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, ఆ కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్క క్షణం కూడా విశ్రమించరని స్పష్టం చేశారు. కేసీఆర్, ఆయన కొడుకు, బిడ్డ, అల్లుడు, చుట్టాలు, భజనపరులు, దొంగ సర్వేలు చేసే ఏజెన్సీలు ఎవరూ కూడా కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఆపలేరని హెచ్చరించారు.....

జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలపై కూడా సీఎం స్పందించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారు మమతా బెనర్జీ పార్టీని చీల్చడం వంటి చర్యల ద్వారా ఇతర పార్టీలను లొంగదీసుకుంటున్నారని, బెదిరించైనా సరే సీట్ల పెంపు (డీలిమిటేషన్) బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని ఆయన ఆరోపించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలకు (One Nation One Election) ఎన్డీఏ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు పరోక్షంగా ప్రస్తావించారు.....

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరగబోతున్నాయనే దానిపై సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబర్ లో గానీ, 2029 డిసెంబర్ లో గానీ జరగవని, జాతీయ స్థాయిలో జరిగే మార్పుల వల్ల 2029 మే-జూన్ మాసాల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. సీట్ల పెంపు ప్రక్రియ పూర్తయ్యాక తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ సీట్లు 26కు, 119 అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయని వివరించారు. పెరిగిన 182 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 117 స్థానాల్లో బంపర్ మెజారిటీతో గెలుస్తుందని, భద్రాచలం రాముడి మీద ఒట్టేసి మరీ జూలై 10, 2026 నాడు తాను ఈ మాట చెబుతున్నానని ఉద్ఘాటించారు. దీని కోసం తాను రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు....అదే విధంగా తెలంగాణలో గత కొంతకాలంగా సీట్ల పెంపు, జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలో సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఖమ్మం వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ పెను దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ లక్ష్యంగా ఆయన చేసిన ఈ 'కురుక్షేత్ర' సవాల్ కు గులాబీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి....