Janam Muchata – Voice of the People | Telugu News Platform › పోలవరం ముంపు.. తెలంగాణకు పెను ముప్పు…పువ్వాడ అజయ్ కుమార్ (మాజీ… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 ✈ in @ ✉
janammuchata.in 12 Oct 2026, 1:54 am
Date of Publish : 01 Jul 2026, 10:50 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 230 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

పోలవరం ముంపు.. తెలంగాణకు పెను ముప్పు…పువ్వాడ అజయ్ కుమార్ (మాజీ రవాణా శాఖ మంత్రి) ఎడిటోరియల్!!

పోలవరం ముంపు.. తెలంగాణకు పెను ముప్పు…పువ్వాడ అజయ్ కుమార్ (మాజీ రవాణా శాఖ మంత్రి) ఎడిటోరియల్!!

ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే, అది తెలంగాణ భూభాగంలోని భద్రాచలం, దాని పరిసర గోదావరి తీర ప్రాంతాలకు పెను విధ్వంసాన్ని మిగల్చనుంది. ఈ చేదు వాస్తవాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గ్రహించాలి. కేవలం ఒక రాష్ట్ర ప్రయోజనాల కోసం మరో రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.దిగువన డ్యామ్‌ నిర్మాణంతో కాఫర్‌ డ్యామ్‌, స్పిల్‌ వే కారణంగా గోదావరి నీళ్లు వెనక్కి తన్ని (బ్యాక్‌ వాటర్‌) తెలంగాణలోని ముంపు మండలాలను చుట్టుముట్టే అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టు డిజైన్ లోపాలతో పోలవరం పూర్తిస్థాయి నీటిమట్టం (FRL) 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా సరిగ్గా 45.72 మీటర్లే. అంటే పోలవరం ప్రాజెక్టు నిండితే, భద్రాచలం శాశ్వతంగా ముంపు ప్రమాదంలోనే ఉన్నట్లు లెక్క....

భద్రాచలం వద్ద గోదావరి లోతైన బెడ్‌ లెవల్‌ 26 మీటర్లు. కానీ బ్యాక్‌వాటర్‌ ప్రభావం వల్ల అక్కడ ఎప్పుడూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల మేర నీరు నిల్వ ఉండడంతో  భద్రాచలం చుట్టు పక్కల ప్రాంతాలు నిరంతరం జలదిగ్బంధం లోనే ఉంటాయి దీనివల్ల 900 ఎకరాలపై నిత్యం నష్ట ప్రభావం పడుతుంది.2021లో కాఫర్‌డ్యామ్‌ నిర్మాణం పూర్తయిన తర్వాత, 2022లో వచ్చిన వరదల్లో భద్రాచలం వద్ద రికార్డు స్థాయిలో 71.3 అడుగుల ఎత్తులో (22 లక్షల క్యూసెక్కులు) వరద ప్రవహించింది. ఈ బ్యాక్‌వాటర్‌ కారణంగా 40 శాతం భద్రాచలం పట్టణం జలమయమైంది,అప్పట్లో 22 లక్షల క్యూసెక్కులకే అంత నష్టం జరిగితే, భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్‌ ప్రకారం 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ప్రాణ, ఆస్తి నష్టాలు ఊహకందని స్థాయిలో ఉంటాయి.....

కేవలం 36 గ్రామాల పరిధిలోని 184 చదరపు కిలోమీటర్ల జనావాసాలే కాకుండా, ఈ ప్రాంత ఆర్థిక, సాంస్కృతిక మూలాలపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది.దాదాపు ఐదువేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్‌బోర్డ్‌, హెవీ వాటర్‌ ప్లాంట్‌, దుమ్ముగూడెం జలవిద్యుత్తు ప్రాజెక్టులకు బ్యాక్‌వాటర్‌ ముప్పు పొంచి ఉంది.అదే విధంగా
దక్షిణాది అయోధ్యగా, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్న భద్రాద్రి రామాలయానికి కూడా ఈ పోలవరం ముంపు ముప్పు తప్పనిసరి....గతంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సమర్థ నాయకత్వంలో, పోలవరం ముంపు సమస్యపై తెలంగాణ పక్షాన పెద్దఎత్తున గళం విప్పాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి తెలంగాణవాసులకు విముక్తి కల్పించాలని డిమాండ్‌ చేశాం. కానీ అటు కేంద్రం గానీ, ప్రస్తుత ఏపీ ప్రభుత్వం గానీ పట్టించుకోలేదు. పోలవరం పూర్తి చేసి తీరుతామని ఏపీ సీఎం చెబుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముంపు సమస్య పరిష్కారానికి ఎలాంటి చొరవా చూపకుండా సోయి లేకుండా వ్యవహరించడం బాధ్యతారాహిత్యం.ఈ అంశం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మాని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం యుద్ధప్రాతిపదికన ఈ కింది చర్యలు చేపట్టాలి గోదావరి వరదను తట్టుకునేందుకు కొత్త కరకట్టలు నిర్మించాలి. భద్రాచలం రక్షణ కోసం ఇప్పటికే ఉన్న కరకట్టల ఎత్తును మరింత పెంచాలి. వర్షాకాలంలో స్లూయీస్‌ల వద్ద వరద నీరు వెళ్లదు కాబట్టి, భారీ మోటర్ల ద్వారా నీటిని తోడేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలి.....

ముంపు ముప్పు ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షితమైన మెరక ప్రాంతాలకు తరలించి, సకల సదుపాయాలతో కూడిన కాలనీలు నిర్మించాలి. సమగ్ర పునరావాస ప్యాకేజీని అమలు చేయాలి.రహదారులపై ప్రవహించే వాగుల మీద చప్టాలు, వంతెనలు నిర్మించాలి. అవసరమైన చోట రోడ్ల ఎత్తు పెంచాలి.పర్యావరణ, సాంకేతిక చర్యలతో పాటు పరిశ్రమలు, వారసత్వ ప్రాంతాల రక్షణకై విధానపరమైన చర్యలు తీసుకోవాలి.వరదలు వస్తే 30 రోజులపాటు జనావాసాలు జలమయమై ప్రజలు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక పడే ఆవేదనను ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజల రక్షణ, వారి శ్రేయస్సును కాపాడాల్సిన ఆవశ్యకత ప్రస్తుత పాలకులపై ఉంది. ముంపు నుంచి తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేయాలని బీఆర్‌ఎస్‌ పక్షాన డిమాండ్‌ చేస్తున్నాం. మానవజాతిని, మన వారసత్వాన్ని కాపాడటమే భవిష్యత్‌ తరాలకు మనం ఇచ్చే శ్రీరామరక్ష....