తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం, జూన్ 25: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దశాబ్దాల చరిత్ర కలిగి, వేలాది మంది పాడి రైతులకు కొండంత అండగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థ 'విజయ డైరీ' మూసివేత వార్తలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, సరైన నిర్వహణ లోపాలు, మరియు ప్రైవేట్ డైరీల పోటీని తట్టుకోలేక ఈ ప్రతిష్టాత్మక సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి మూతపడే స్థితికి చేరుకుందనే వార్తల నేపథ్యంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి.ఈ నేపథ్యంలో, డైరీ ప్రస్తుత దుస్థితిపై వాస్తవాలను తెలుసుకునేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒక 'నిజనిర్ధారణ కమిటీ' (Fact-Finding Committee) ఈరోజు ఖమ్మంలోని విజయ డైరీ ప్రాంగణాన్ని సందర్శించింది….
క్షేత్రస్థాయిలో డైరీ పరిస్థితుల పరిశీలన…..
బీజేపీ కమిటీ సభ్యులు డైరీలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్లాంట్ ప్రస్తుత స్థితిగతులు, యంత్రాల నిర్వహణ, పాల సేకరణ వివరాలు మరియు సంస్థ నష్టాల్లోకి వెళ్లడానికి గల కారణాలను అక్కడ ఉన్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉద్యోగులు, కార్మికులు మరియు పాల ఉత్పత్తిదారులతో (పాడి రైతులు) కమిటీ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను సేకరించింది.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ.. విజయ డైరీ కేవలం ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే కాదని, ఉమ్మడి జిల్లాలోని వేలాది మంది పాడి రైతులు, కార్మికులు, అనుబంధ వ్యాపారాల కుటుంబాల జీవనాధారమని పేర్కొన్నారు. డైరీ మూతపడితే ప్రైవేట్ డైరీలు ముఠాగా ఏర్పడి ధరలు తగ్గించి రైతులను దోచుకునే ప్రమాదం ఉంది. ప్రభుత్వ మద్దతు ధర, బోనస్ లభించక రైతులు నష్టపోతారని అంతే కాకుండా డైరీని నమ్ముకుని దశాబ్దాలుగా పని చేస్తున్న వందలాది మంది కార్మికులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు వీధిన పడే దుస్థితి ఏర్పడుతుందని అదే విధంగా సామాన్య ప్రజలకు నాణ్యమైన విజయ డైరీ ఉత్పత్తులు దూరమవుతాయని అన్నారు….
డైరీ పరిస్థితులపై సమగ్ర నివేదికతో అధికారుల దృష్టికి…..
వాస్తవ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం, ఈ సమస్యపై ఒక సమగ్ర నివేదికను తయారు చేసి, సంబంధిత ఉన్నతాధికారుల మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కమిటీ వెల్లడించింది. లాభాల్లో నడవాల్సిన ప్రభుత్వ సంస్థను నష్టాల బాట పట్టించిన అధికారుల బాధ్యతారహిత్య వైఖరిని వారు తప్పుపట్టారు."రైతులు, కార్మికులు మరియు సామాన్య ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని,విజయ డైరీని మూసివేయనిచ్చే ప్రసక్తే లేదని,ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించి, డైరీని ఆధునీకరించి పూర్వవైభవం తీసుకురావాలని,లేనిపక్షంలో పాడి రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని గల్లా సత్యనారాయణ హెచ్చరించారు.ఈ నిజనిర్ధారణ కమిటీ పర్యటనలో జిల్లా, నియోజకవర్గ స్థాయి బీజేపీ ముఖ్యాధికారులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో పాడి రైతులు పాల్గొన్నారు…..
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456