తెలంగాణ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:
అశ్వరావుపేట: ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ మంత్రుల తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి, దోపిడీ రాజ్యమేలుతోందని సంచలన ఆరోపణలు చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కేవలం కేసీఆర్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో గిరిజన గ్రామాలు, ఇక్కడి ప్రజలు మాకు, మా కుటుంబానికి అత్యంత ఆప్రతులని,గిరిజన బిడ్డల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల రైతాంగానికి సాగునీరు అందించాలనే ఉదాత్తమైన లక్ష్యంతోనే కేసీఆర్ సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.....
బుగ్గపాడు భూముల్లో భారీ కుంభకోణం....
కాంగ్రెస్ మంత్రుల హయాంలో భూముల దోపిడీ జరుగుతోందని పువ్వాడ ఆరోపించారు. సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూములను కాంగ్రెస్ మంత్రులు తమ స్వార్థం కోసం అత్యంత తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని, దీనిపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని గాలికొదిలేసిన అధికార పార్టీ నేతలు, అక్రమాలకు తెరలేపారని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు మట్టిని అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మట్టి, ఇసుక మాఫియా పెట్రేగిపోతోందని, ఈ దోపిడీలతో కాంగ్రెస్ మంత్రులు జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు....
సీతారామ ప్రాజెక్టు విషయంలో ఫోటోలకే పరిమితమైన మంత్రులు....
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి, సంకల్పం ఏమాత్రం లేదని పువ్వాడ తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే అది మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని ప్రజలు కూడా నమ్ముతున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన వివరించారు. "కేసీఆర్ హయాంలో రాజకీయ పార్టీలు, కుల మతాలకు అతీతంగా ప్రతి రైతుకూ ఠంచనుగా 'రైతుబంధు' సాయం అందింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచింది. ఇప్పటి మంత్రులు కేవలం గోదావరి నీళ్లు నెత్తిన చల్లుకుని కెమెరాలకు ఫోజులు కొట్టడమే తప్ప, ఆచరణలో ప్రజలకు, రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు," అని ఎద్దేవా చేశారు.
హరీశ్ రావు చుట్టూ తిరిగిన రోజులు మర్చిపోయారా?:
ఈరోజు బీఆర్ఎస్ పార్టీపై, తమ నాయకులపై ప్రగల్భాలు పలుకుతూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ మంత్రులు గతాన్ని మర్చిపోకూడదని పువ్వాడ హెచ్చరించారు. "ఇప్పుడు గొప్పలు చెబుతున్న ఇదే మంత్రులు.. ఒకనాడు తమ పనులు చేయించుకోవడం కోసం మాజీ మంత్రి హరీశ్ రావు ఇంటి వద్ద పడిగాపులు కాసిన రోజులు ఉన్నాయన్న సంగతి గుర్తుంచుకోవాలి," అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పక్షాన ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు.....
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456