Janam Muchata – Voice of the People | Telugu News Platformకన్నీరు పెట్టిస్తున్న అనాథ బాలిక దీనస్థితి… ఆదుకునే దాతల కోసం… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 2:48 am
Date of Publish : 22 Jun 2026, 11:17 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 221 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

కన్నీరు పెట్టిస్తున్న అనాథ బాలిక దీనస్థితి… ఆదుకునే దాతల కోసం అభాగ్యురాలి ఎదురుచూపులు!!

కన్నీరు పెట్టిస్తున్న అనాథ బాలిక దీనస్థితి… ఆదుకునే దాతల కోసం అభాగ్యురాలి ఎదురుచూపులు!!

ఖమ్మం (రూరల్): పసిప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ఒక అనాథ బాలికను విధి మరింత వెక్కిరించింది. క్యాన్సర్ మహమ్మారి తండ్రిని బలితీసుకోగా... అనారోగ్యం తల్లిని దూరం చేసింది. అయినవారు లేక అనాథగా మిగిలిన ఆ పసిప్రాణంపై కన్నీటి కడగండ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లా రూరల్ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన 'మొక్క వెన్నెల' అనే బాలిక దీనస్థితి ఇప్పుడు ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది....

వెన్నెల తండ్రి వీరబాబు గతంలో క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందగా, తల్లి గోవిందమ్మ సైతం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసింది. తల్లిదండ్రులు లేని లోటును దిగమింగుకుంటూ, కష్టాలను ఎదిరించి తన కాళ్ల మీద తాను నిలబడాలనే పట్టుదలతో వెన్నెల ఇంటర్మీడియట్ (MPHW) మొదటి సంవత్సరం చదువుతోంది. కానీ, విధికి ఆమెపై ఇంకా జాలి కలగలేదు. ఇటీవల జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో వెన్నెల కాలు తీవ్రంగా విరిగింది. వైద్యులు ఆపరేషన్ చేసి కాలికి రాడ్ వేశారు. కొద్ది రోజుల క్రితమే ఆ రాడ్‌ను కూడా తొలగించారు.

ప్రస్తుతం కాలు కదపలేని నిస్సహాయ స్థితిలో మంచానికే పరిమితమైన ఆ బాలికకు కనీసం గుక్కెడు నీళ్లు ఇచ్చి ఆదరించే నాథుడే లేడు. పూట గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో... కడుపు నిండా భోజనం లేక, అవసరమైన మందులు కొనుక్కోవడానికి చేతిలో చిల్లిగవ్వ లేక ఆ అభాగ్యురాలు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. కన్నీళ్లే తోడుగా ఆమె గడుపుతున్న రోజులు ఎవరికైనా కంటతడి పెట్టిస్తాయి.

మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించాల్సిన సమయం ఇది. దయగల దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సహృదయులు ముందుకు వచ్చి ఈ అనాథ బాలికకు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మీరు చేసే చిన్న సాయం.. విధి వంచించిన ఆ బాలికకు కొత్త జీవితాన్ని, భవిష్యత్తుపై ఆశను కల్పించగలదు....

గమనిక: దాతలు నేరుగా పై ఫోన్ నంబర్‌కు కాల్ చేసి బాధితురాలి పరిస్థితిని కనుక్కొని, తమకు తోచిన సహాయం అందించగలరు....