Janam Muchata – Voice of the People | Telugu News Platformసత్తుపల్లి బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపులో పెను దుమారం:… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 2:48 am
Date of Publish : 20 Jun 2026, 10:33 am  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 204 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

సత్తుపల్లి బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపులో పెను దుమారం: రాజకీయ మౌనం వెనుక ఆంతర్యమేమిటి?

సత్తుపల్లి బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూముల కేటాయింపులో పెను దుమారం: రాజకీయ మౌనం వెనుక ఆంతర్యమేమిటి?

ఖమ్మం/సత్తుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ ఇప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. స్థానిక రైతులు, నిరుద్యోగుల ఆశల సౌధంగా నిలవాల్సిన ఈ ఫుడ్ పార్క్ భూములు.. అధికార పక్ష పెద్దల కనుసన్నల్లో కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం అవుతున్నాయనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. వందల కోట్ల విలువైన భూములను నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం వెనుక భారీ స్కామ్ దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.....

బుగ్గపాడు ఫుడ్ పార్క్ పరిధిలో ఎకరం భూమి బహిరంగ మార్కెట్లో రూ. 50 నుంచి 55 లక్షల వరకు పలుకుతోంది. స్వయంగా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్ణయించిన ధర ఎకరానికి రూ. 40.47 లక్షలు. కానీ ఆశ్చర్యకరంగా, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన 'దీపక్ నెక్స్ట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్' కంపెనీకి కేవలం రూ. 21 లక్షలకే ఏకంగా 72 ఎకరాలను ప్రభుత్వం కట్టబెట్టింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఫుడ్ పార్క్‌లోకి దారి కోసం ఇదే కంపెనీ పక్కనే ఉన్న ఓ రైతు వద్ద ఎకరం రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. దారి కోసం రైతుకు 75 లక్షలు ఇచ్చిన కంపెనీకి.. ప్రభుత్వం మాత్రం 21 లక్షలకే తమ భూమిని అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. పైగా ఈ కేటాయింపులకు కనీసం రాష్ట్ర కేబినెట్ ఆమోదం కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.....

ఈ బాగోతం వెనుక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సీనియర్ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సదరు 'దీపక్ నెక్స్ట్ జెన్' కంపెనీ యాజమాన్యంతో ఆ మంత్రికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆ ప్రాబల్యంతోనే ఇంత తక్కువ ధరకు భూములు కేటాయించారని పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఏకంగా ఈ కంపెనీలో సదరు మంత్రి కుమారుడు 'స్లీపింగ్ పార్టనర్' గా ఉన్నారన్న వార్తలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. జిల్లాకు చెందిన ముగ్గురు కీలక మంత్రులు ఈ వ్యవహారంపై నోరు మెదపకపోవడం, ఖండించకపోవడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తోంది.....

సాధారణంగా ఇలాంటి భూ కుంభకోణాలు జరిగితే ప్రతిపక్ష పార్టీలు రోడ్డెక్కాలి. కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్, ఆ పార్టీ అనుకూల మీడియా ఈ అంశంపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పాత, కొత్త ప్రభుత్వాల మధ్య ఏమైనా లోపాయికారీ ఒప్పందాలు జరిగాయా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే, పార్టీకి చెందిన కొందరు నేతలు ఒకరోజు హడావిడి చేసి, కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేస్తానని చెప్పి ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వెనుక దాగి ఉన్న రహస్యమేమిటో వారికే తెలియాలి. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వామపక్షాలు (CPI, CPM) సైతం ఈ భారీ భూకేటాయింపుల వ్యవహారంపై మౌనం వహించడం ప్రజల్లో తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది....

ఈ భూకేటాయింపుల వివాదంపై TGIIC ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి ఇస్తున్న వివరణ విడ్డూరంగా ఉంది. "కంపెనీలు రాక భవనాలు శిథిలావస్థలోకి చేరుకుంటున్నాయి.. అందుకే తక్కువ ధరకు భూములు కేటాయించాం" అని చెప్పడం ఏమాత్రం సహేతుకం కాదు. ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులే, ఇలా ప్రైవేట్ కంపెనీలకు మేలు చేసేలా వాదించడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు, కొన్ని "అనుకూల మీడియా" సంస్థలు అసలు స్కామ్ ను పక్కనపెట్టి, వేలాది మందికి ఉపాధి రాబోతోందంటూ 'అభివృద్ధి మంత్రం' జపించడం వెనుక అదృశ్య శక్తుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది.....

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో విస్తారంగా పండే జామ, మామిడి, బొప్పాయి, ఆయిల్ పామ్, మిర్చి తదితర పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. రైతుల నుంచి ఎకరం రూ. 2 లక్షల లోపు పరిహారంతో దాదాపు 200 ఎకరాలకు పైగా సేకరించారు. ఆ తర్వాత 2016లో గత ప్రభుత్వం కూడా దీని అభివృద్ధికి చర్యలు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నాబార్డ్ నిధులతో సుమారు రూ. 109 కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించారు. స్థానిక రైతుల వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ లక్ష్యంగా ఏర్పాటైన ఈ ప్రాజెక్టును, ఇప్పుడు చేపలు, రొయ్యల దాణా (ఆక్వా ఫీడ్) తయారు చేసే ఆంధ్రా కంపెనీలకు కట్టబెట్టడం అసలు లక్ష్యాన్నే నీరుగార్చడమే అవుతుంది.....

బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ వ్యవహారం కేవలం ఒక కంపెనీకి భూములు కట్టబెట్టడం మాత్రమే కాదు.. వందల కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టిన తీరుకు అద్దం పడుతోంది. పాలకుల మౌనం, ప్రతిపక్షాల నిర్లిప్తత, అధికారుల వత్తాసు అన్నీ కలిపి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం తక్షణమే ఈ వివాదాస్పద భూకేటాయింపులపై స్పందించి, సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర దర్యాప్తు చేయిస్తేనే.. దీని వెనుక ఉన్న మంత్రులు, వారి కుమారులు, తెరవెనుక నడిపిన శక్తుల అసలు బండారం బయటపడుతుందని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.....